Friday, March 18, 2011

best mother in the world







అమ్మా యాడ్కి వోతున్నవే  అంటే 
ఇంక్యాడ్కి వోత 
పొద్దుట్యాల్లకు  కూముకింత గంజివోయాలగద 
గందుకే సేన్కి కల్వనిక్కె వోతున్న, అనెడిది 
అందర్లెక్క నన్నేమన్న బల్సినోన్కిఇచ్చిన్డ్రా      
మాయప్ప బర్వు దిన్పుకోనిక్కే 
ఎన్కముందు జూడకుండ మీ యప్పకుకట్టవెట్టె
మీ యప్పకేమో బీడిల మీద పత్తల మీదున్న సోయి 
పెండ్లాం పిల్లల మీద లేదాయె , అనెడిది 

అందరు కూలోల్లు నస్కుల్లనే వోతే
మాయమ్మ శాన తడువయిపోతుండె 
ఇంట్లో అందరికి కూడొండాలికదా !
కానీ సటసట కల్సి 
మాపటికల్ల అందరికన్నా ఎక్కువ సాల్లు 
కలుస్తుండేనంట, పక్క కూలోల్లు జెప్తుండే 
ఆయితారం మాత్రం సేనికి కల్వనీకే పోకుండే 
అట్లాని ఆయితారం తాతీల్లు  అనుకొనేరు 
ఒంట జెయ్యనిక్కే కట్టెలు గావాలి గద 
గందుకే నస్కుల లేసి అడ్వికి పోతుండె 
ఒక్కతే వొయ్యేది గాదు 
కమ్మరామెనో, గుడుమల్లామెనో, బాయికాడమెనో
ఎన్క వెటకపోయేడిది 
ఇచింత్రం ఏందోగాని, మాయమ్మ 
ముగ్గురు దోస్తుల పేర్లూ బిచ్చమ్మనే 
పొద్దు పోయినా రాకపోయే సర్కి 
ఇంటిముందు వోయెటొల్లను  
సేన్లకెంచి వచ్చెటొల్లనూ 
మాయమ్మ కన్పించిందేమో అడిగేతోల్లం   
గాసొంటప్పుడు, కర్ణం హన్మంత్రావ్ తాత 
బండల మీద వోకుంట, మీయమ్మకేం గాదురా 
శాన ధైర్యమున్న తల్లి 
ఇద్దరి మొగొల్ల బరువు ఒక్కతే మోస్తది 
ఆయమ్మకు ఆశ ఎక్కువ 
మీ యప్పను జేస్కున్న కాడినుంచీ 
ఇప్పటి దాక సుకమే తెలవదు దేవమ్మకు 
అని ఇంటి మున్దోల్లకు జెప్తుంటే 
కండ్ల నీళ్ళు దిరుగుతుండే 
గుండెలకెంచి ఎవరో దేవినట్లయితుండే 
ఇంటికి రాంగనే గట్టిగ వట్కొని ఎడ్వాలనిపిస్తుండే

కాని, రావడం రావడమే కోపంగా తిట్కూంట వస్తుండే 
పెద్ద కట్టెల మోపు, దానిపైన గడ్డి మోపు..
దర్వాజల పట్టకపొతే ఇద్దరం కలిసి దిన్పెతోల్లం 
చేతులు కాళ్ళు కడుక్కొని వొర్లుకుంట రొట్టెలు చేస్తుండె 
ఎందుకంత కష్టం జేస్తదో, ఎందుకంత ఒర్లుతదో 
మా కర్తమయ్యేడిది కాదు 
తిని మేము పండుకున్నంక ఎప్పుడు పండెడిదో  ఏమో?
పొద్దున్న లేస్తనే వాకిలి ఊడ్సుకుంట కన్పింస్తుండే 

బతుకంతా మాకు ఊడిగం చేసి, చేత కాకున్నా 
చేతి విరిగినా, మా పిల్లలకు చేసుకుంటా 
లంకంత కొంపలో ఒంటరిగా ఉంచిన 
ఆయమ్మ రాత గా బ్రమ్మ ఎట్ల రాసిండో గదా?

2 comments:

  1. Good one ra..Keep it up!!
    -Venu

    ReplyDelete
  2. sir...real ga kanulaki kanipinchetatlu rasaru.. me alochanalaki hatsup sir..

    ReplyDelete